వర్మ వెర్సస్ హన్మంత రావు బిగ్ ఫైట్

హైదరాబాద్ ఆర్టీసీ బస్సుపై అంటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలోని అభ్యంతరకరమైన పోస్టర్ ను కాంగ్రెస్ నేత వి హనుమంతరావు చించివేయడంపై దర్శకుడు, నిర్మాత రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. అటువంటి సినిమా పోస్టర్ వి హనుమంతరావు వంటి తాతయ్యల కోసం కాదు...ఆయన మనుమలు, మనుమరాళ్ళ వయసున్న వారి కోసం వేసింది. ఆ పోస్టర్ లో ఏమైనా తప్పుందేమో ఆయన తన మనుమలను అడిగి తెలుసుకొంటే లేదని వాళ్ళే చెపుతారని వర్మ ట్వీట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలాగే హనుమంతరావు కూడా ముసలివాడయిపోయాడని ఇటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉంటే మంచిదని వర్మ సూచించారు. వర్మ చేసిన వ్యాఖ్యలపై హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎప్పుడూ రౌడీలు, గూండాలు, హత్యలు వంటి అంశాలతో పనికిమాలిన సినిమాలు తీసే అతనా నాకు పాఠాలు చెప్పేది. ఇటువంటి అడ్డమైన చెత్తా తీసి పిల్లల బుర్రలు పాడుచేయడానికి నీకేమి అధికారం ఉంది. అతిగా ప్రవర్తిస్తే గట్టిగా బుద్ధి చెపుతాము జాగ్రత్త,” అని హెచ్చరించారు. బహుశః రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అంతకంటే ఘాటుగా స్పందించవచ్చు.

వీరిద్దరి మద్య మొదలైన ఈ యుద్ధంలో ఆ సినిమా దర్శకనిర్మాతలు ఎవరూ కలుగజేసుకోకపోవడం విశేషం. మరో   విశేషమేమిటంటే వారి మద్య జరుగుతున్న ఈ యుద్దమే ఆ సినిమాకు ఉచిత ప్రచారం కల్పిస్తోంది. అసలు వారిద్దరూ అంతగా కొట్లాడుకొనేందుకు ఆ సినిమాలో ఏముంది? అని అందరూ ఆలోచింపజేస్తున్నాయి. బహుశః అందుకే ఆ ఆ సినిమా దర్శకనిర్మాతలు కలుగజేసుకోవడంలేదేమో?