యూపిలో 5 రోజుల వ్యవధిలో వరుసగా రెండు ఘోర రైలు ప్రమాదాలు జరుగడంత్ వాటికి నైతిక బాధ్యత వహించి రైల్వేబోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ నిన్న రాజినామా చేయడం, ఆయన స్థానంలో ఎయిర్ ఇండియా సిఎండి అశ్విన్ లోహాని నియామకం చకచకా జరిగిపోయాయి. ఆ ఘటనలకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడానికి సిద్దపడ్డారు. ఆయన నిన్న ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తాను కూడా అదే కారణాలతో పదవిలో నుంచి తప్పుకోవాలనుకొంటున్నట్లు చెప్పగా, ప్రధాని ఆయనను వారించారు. కానీ ఆయన పదవి నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపుతుండటంతో ఆ శాఖ భాద్యతలను ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారికి అప్పగించాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.
సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రైల్వేశాఖలో అనేక సంస్కరణలు చేపట్టారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయిస్తున్నారు. రైల్వేలను ఆధునీకరించి ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత 4 దశాబ్దాలతో పోలిస్తే ఈ మూడేళ్ళ వ్యవధిలోనే రైల్వేశాఖలో అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పవచ్చు. భారతీయ రైల్వేను మళ్ళీ పట్టాల మీదకు ఎక్కించి పరుగులు తీయిస్తున్న సురేష్ ప్రభు, వరుసగా రెండు రైళ్ళు పట్టాలు తప్పడంతో రాజినామా చేయడానికి సిద్దపడటం బాధాకరమే. మరి ప్రధాని నరేంద్ర మోడీ ఏమి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.