జగన్ ఆవేశంతో వైకాపాకు ఇబ్బందులు

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అంటే చాలా కోపం, అసహ్యం. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక ఆయన నిత్యం చంద్రబాబును తిట్టిన తిట్టుతిట్టకుండా తిడుతుంటారు. ఆ కోపంలో చాలాసార్లు నోరుజారుతుంటారు కూడా. మామూలు సమయంలో అయితే తెదేపా నేతలు వాటిని అంతగా పట్టించుకొనేవారు కారు కానీ నంద్యాల ఉపఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి అటువంటి అవకాశం ఇస్తే తెదేపా నేతలు ఎందుకు వదులుకొంటారు?

ఎన్నికల ప్రచార సందర్భంగా రోడ్ షో లలో జగన్మోహన్ రెడ్డి ప్రజలనుదేశ్యించి మాట్లాడుతూ, “ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నడిరోడ్డుపై తుపాకీ పెట్టి కాల్చి చంపినా తప్పులేదు,” అని అన్నారు. 

దానిపై తెదేపా నేతలు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు పిర్యాదు చేయగా ఆయన వివరణ కోరుతూ జగన్మోహన్ రెడ్డికి నోటీస్ జారీ చేశారు. దానికి వివరణ ఇచ్చిన మరునాడే జగన్ మళ్ళీ “ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు” అని అన్నారు. ఈసారి తెదేపా నేతలు నేరుగా కేంద్ర ఎన్నికల కమీషనర్ కు పిర్యాదు చేశారు. పనిలోపనిగా జగన్ అంత అనుచితంగా మాట్లాడుతున్న ఆతనిపై కటినచర్యలు తీసుకోకుండా భన్వర్ లాల్ ఉపేక్షిస్తున్నారని ఆయనపై కూడా పిర్యాదు చేశారు. 

వారి పిర్యాదులపై స్పందించిన కేంద్ర ఎన్నికల కమీషనర్ ఎన్నికల కోడ్ అతిక్రమించిన నేరానికి జగన్మోహన్ రెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ భన్వర్ లాల్ కు లేఖ వ్రాశారు. కనుక ఈ ఉపఎన్నికలలో వైకాపా గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆవేశం, నోటిదురుసు కారణంగా వైకాపాకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవేళ ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిపై ఏవైనా కటిన చర్యలు తీసుకొన్నట్లయితే అందుకు వైకాపా నేతలు మీడియాకు, తెదేపా నేతలకు జవాబు చెప్పుకోలేక ఇబ్బందిపడక తప్పదు.