యూపిలో వరుసగా రెండు ఘోర రైలు ప్రమాదాలు జరుగడంతో వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ బుదవారం తన పదవికి రాజీనామా చేశారు. అయన తన రాజీనామా లేఖను రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు సమర్పించారు.
నాలుగు రోజుల క్రితం యూపిలో ఉత్కల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ ప్రమాదంలో 26 మంది మృతి చెందగా, 156 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మళ్ళీ బుధవారం తెల్లవారుజామున యూపిలోనే కైఫియత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ రెండు ప్రమాదాలు తనకు చాలా బాధకలిగించాయని, వాటికి తానే నైతిక భాద్యత వహించడం న్యాయం కనుక రాజీనామా చేస్తున్నట్లు మిట్టల్ తన లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు.
ఈరోజుల్లో ఎన్ని ఘోరమైన ప్రమాదాలు, పొరపాట్లు జరుగుతున్నా ఎవరూ ఈవిధంగా వాటికి నైతిక బాధ్యతవహించి రాజీనామా చేయడం లేదు. యూపి గోరక్ పూర్ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో 10 రోజుల వ్యవధిలో 68 మంది చిన్నారులు చనిపోతే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు నైతిక బాధ్యత రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడిచేసినా వారు రాజీనామా చేయలేదు. కానీ సకాలంలో నిధులు అందిస్తూ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా ఆగకుండా చూడాలని ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తులు చేసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసి యోగి సర్కార్ చేతులు దులుపుకొంది. వారితో పోల్చి చూస్తే ఎకె మిట్టల్ వెయ్యి రెట్లు నయం అని అర్ధం అవుతుంది.