నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతీ మందిరంలో పూజారుల భాగోతాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పరిధి దాటి బయటకు తీసుకువెళ్ళడం అపచారం..నేరం అని తెలిసికూడా ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ కుమార్, మరో ఇద్దరు అర్చకులు ప్రణవ్ కుమార్, విశ్వజిత్ లతో కలిసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో దేవరకొండకు తరలించి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.
ఈవిషయం బయటకు పొక్కడంతో అధికారులు మేల్కొని ఆ పూజారులపై చర్యలు తీసుకొన్నారు. మొదట ఆలయ ప్రధానార్చకుడు సంజీవ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. విచారణ అనంతరం మిగిలిన ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ ఈ అపచారానికి ఇంకా ఇతరులు ఎవరైనా కారకులని తెలిస్తే వారిపై కూడా కటినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆలయ పూజారులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయటకు తీసుకువెళ్ళి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు మీడియాలో వార్తలు వస్తే గానీ ఆలయ అధికారులకు తెలియలేదంటే ఆలయ నిర్వహణ ఎంత గొప్పగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. కనుక పూజారులను సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకోకుండా సమూలంగా ఆలయ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నట్లే కనిపిస్తోంది.