ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు త్వరలో రాజకీయ ప్రవేశం చేయవచ్చని తాజా సమాచారం. ఆయనను తెరాసలో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెరాసలో చేరితే వచ్చే ఎన్నికలలో ఆయన స్వంత జిల్లా నిజామాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు తెరాస టికెట్ కూడా ఇస్తానని హామీ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తీసిన ‘ఫిదా’ సినిమాను నిజామాబాద్ జిల్లాలో బాన్స్ వాడలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. దానిలో తెలంగాణా బాష, సంస్కృతి పట్ల ఆయన తన అభిమానాన్ని చాటుకొన్నారు. ఆ సినిమాను చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటిఆర్ కూడా దానికి ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో నటించిన నటీనటులను, దర్శకనిర్మాతలను వచ్చి తనను కలవమని కోరారు కూడా. అయితే దిల్ రాజును తెరాసలో ఆహ్వానించడానికి ఈ సినిమా మాత్రం కారణం కాదు. నిజామాబాద్ జిల్లా ప్రజలలో అయనకున్న మంచిపేరు, ప్రతిష్టలు, తెలంగాణా పట్ల ఆయనకున్న అభిమానం చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దసరా పండుగ రోజున కానీ ఆ తరువాత గానీ దిల్ రాజు రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయవచ్చని సమాచారం. అయితే ఈ వార్తలను ఆయన లేదా తెరాస దృవీకరిస్తే తప్ప నిజమని నమ్మలేము.