ట్రిపుల్ తలాక్ పై కాంగ్రెస్, భాజపాల స్పందన

ట్రిపుల్ తలాక్ ను ఆరు నెలలపాటు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్, భాజపాలు స్వాగతించాయి. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ, భాజపా తరపున అమిత్ షా, ఇంకా ప్రధాని నరేంద్ర మోడీ ఆ తీర్పును స్వాగతించారు. 

సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ “ఇది చాలా చారిత్రాత్మకమైన తీర్పు. ఈ తీర్పు ముస్లిం మహిళలకు సమానత్వాన్ని, గౌరవాన్ని ఇస్తోంది. మహిళాసాధికారికత కోసం వేసిన తొలి అడుగు ఇది,” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అమిత్ షా స్పందిస్తూ “ఈ తీర్పును ఒకరి విజయంగా మరొకరి అపజయంగా చూడరాదు. ఇది ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని కల్పిస్తున్న తీర్పుగా మాత్రమే చూడాలి. దీనిని మా పార్టీ మనస్పూర్తిగా స్వాగతిస్తోంది," అని అన్నారు.  

మనీష్ తివారీ స్పందిస్తూ, “ప్రగతి శీలకమైన ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. ఈ సమస్యను మతపరంగా కాకుండా భాదిత ముస్లిం మహిళలపరంగా చూసినట్లయితే చాలా గొప్ప తీర్పు. దీనిని అందరూ స్వాగతించాలి. ట్రిపుల్ తలాక్ అనేది అంతరానితం వంటిది. దానిని నిషేదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాము,” అని అన్నారు.