జమ్మికుంట ప్రత్యేకత ఏమిటో తెలుసా?

కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఆ పట్టణం రోజూ సరిగ్గా ఉదయం 7.54 గంటలకు 52 సెకన్లపాటు స్తంభించిపోతుంది. రోడ్లపై వాహనాలు నడిపేవారు, బజార్లలో వర్తకులు, ప్రజలు, స్కూళ్ళు, కాలేజీలకు వెళుతున్న విద్యార్ధులు, మహిళలు అందరూ ఎక్కడివారక్కడే నిలబడిపోతారు. చివరికి ట్రక్ డ్రైవర్స్, ఆర్టీసి బస్సులు కూడా నిలిచిపోతాయి. ఎందుకో తెలుసా? ఆ సమయంలో మైకులలో జాతీయగీతం వినిపిస్తుంది. ఎక్కడివారక్కడ నిలిచిపోయి అందరూ గొంతు కలిపి దానిని ఆలపిస్తుంటారు. ఆలపించకపోయినా దానిని గౌరవిస్తూ నిలబడుతారు. భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొన్నారుట. ఆ విషయం తెలియని వారి కోసం ఎక్కడికక్కడ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి తెలియజేస్తున్నారు. జాతీయగీతం వినిపించేందుకు పట్టణంలో 16 ముఖ్య కూడళ్ళలో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. జాతీయగీతం వినిపించబోతున్న సూచనగా ముందు ఒక సైరన్ మ్రోగుతుంది. అది వినగానే ప్రజలు తమ పనులను కట్టిబెట్టి నిలబడతారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి జమ్మికుంట ప్రజలు దీనిని అమలుచేస్తున్నారు.