నేరెళ్ళ ఘటనపై నేడు హైకోర్టు విచారణ

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ నేరెళ్ళ ఘటనలను వివరిస్తూ వ్రాసిన లేఖను ప్రజాప్రయోజన పిటిషన్ గా స్వీకరించిన హైకోర్టు దానిపై మంగళవారం విచారణ జరుపనుంది.

సిరిసిల్ల జిల్లాలో నేరెళ్ళ, రామచంద్రాపురం, జిల్లెల గ్రామాలలో దళితులు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని జస్టిస్ చంద్రకుమార్ తన లేఖలో పేర్కొన్నారు. నేటికీ వారికి న్యాయం జరుగలేదని, కనుక హైకోర్టు మళ్ళీ వారి వాంగ్మూలాలు తీసుకొని తదనుగుణంగా దోషులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ తన లేఖలో కోరారు. 

హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ నేతృత్వంలో ధర్మాసనం నేడు ఆ పిటిషన్ పై విచారణ జరుపనుంది. ఇప్పటికే నేరెళ్ళ ఘటనపై దాఖలైన మరో పిటిషన్ పై హైకోర్టు విచారణ జరుపుతోంది. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైనవారికి అవసరమైతే హైదరాబాద్ నిజాం ఆసుపత్రికి తరలించి మంచి చికిత్స అందించాలని, ఈ కేసులో మళ్ళీ దర్యాప్తు చేసి నాలుగు వారాలలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మళ్ళీ ఈరోజు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఏమి చెపుతుందో చూడాలి.