హైదరాబాద్ ప్రత్యేకత అది: వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్య నాయుడుకు మొట్టమొదటిసారిగా సోమవారం హైదరాబాద్ వచ్చారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు తదితరులు విమానాశ్రయానికి వెళ్ళి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.

అనంతరం తనకు జరిగిన పౌరసన్మానంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, “నేను తిరిగింది.. పెరిగింది..రాజకీయంగా ఎదిగిందీ అంతా హైదరాబాద్ లోనే. తెలంగాణాలో దాదాపు అన్ని మండలాలలో పదుల సంఖ్యలో పర్యటించి ఉంటాను. తెలంగాణాలో నేను పర్యటించని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదేమో. అంతగా రాష్ట్రమంతటా పర్యటించాను. అందుకే నాకు తెలంగాణాతో ముఖ్యంగా..హైదరాబాద్ తో చాలా అనుబంధం ఉంది.

తెలంగాణాకు గుర్తింపు తెచ్చింది హైదరాబాద్. దీనిని 'సౌత్ ఆఫ్ నార్త్ ఇండియా' అని కొందరుభావిస్తే 'నార్త్ ఆఫ్ సౌత్ ఇండియా' అని మరికొందరు భావిస్తుంటారు. ఇక్కడ లేని బాష లేదు. దొరకని ఆహారం లేదు. హైదరాబాద్ బిర్యానీ, హలీం నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. భిన్న సంస్కృతులు, భిన్నమైన వేషబాషలు, అనేక బాషలు, రకరకాల ఆహారపదార్ధాలు హైదరాబాద్ విశిష్టతను చాటి చెపుతుంటాయి. అందుకే మినీ ఇండియా వంటి హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం.

నేను ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి యధాశక్తిన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటాను. ఇరువురు ముఖ్యమంత్రులు కూడా పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని నేను కోరుకొంటున్నాను. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యప్రజలకు కూడా అర్ధం చేసుకొని ఆనందించగల సరళమైన బాషలో మాట్లాడుతుంటారు. ఆయనకు అద్భుతమైన బాషాపటిమ ఉంది. అందుకే ఆయన ప్రసంగాలను వినడానికి నేను ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటాను,”అని అన్నారు.