అక్రమాస్తుల కేసులో జైలు పాలైన అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో డబ్బులు వెదజల్లి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని సాక్షాత్ ఆ రాష్ట్ర మాజీ జైళ్ళ డిఐజి రూపా బయటపెట్టిన సంగతి తెలిసిందే. అందుకు ఆమెను జైళ్ళ విభాగం నుంచి ట్రాఫిక్ విభాగానికి కర్నాటక ప్రభుత్వం బదిలీచేసింది. అయితే శశికళ కేవలం జైలులో విలాసవంతమైన జీవితం గడపడేకాకుండా అదే జైలులో ఉన్న తన మేనకోడలు ఇళవరసితో కలిసి హాయిగా బయటకు వెళ్ళి వస్తోందని నిరూపించే ఒక వీడియో క్లిప్పింగ్ ను డిఐజి రూపా రాష్ట్ర అవినీతిశాఖ అధికారులకు అందించడం సంచలనం సృష్టిస్తోంది. వారిరువురూ జైలు బయటకు వెళుతున్నప్పుడు సాధారణ దుస్తులు ధరించి చేతిలో హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని వెళుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతోంది. ఆమెకు రక్షణగా ఇద్దరు జైలు సిబ్బంది కూడా ఉన్నారు. మరి కర్నాటక ప్రభుత్వం దీనిని ఏవిధంగా సమర్ధించుకొంటుందో, ఈసారి ఎవరిపై వేటు వేస్తుందో చూడాలి.