తెలంగాణా జెఎసి నేతలు, కొన్ని ప్రజా సంఘాల నేతలు నేడు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నుంచి ధర్నా చౌక్ ను నగరశివార్లకు తరలించడాన్ని నిరసిస్తూ టిజెఎసి ఈ ధర్నా చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలు కూడా ధర్నా చౌక్ తరలింపును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి కనుక వాటి జాతీయనాయకులను డిల్లీలో నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గోనవలసిందిగా టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆహ్వానం పంపారు. ఆమె స్వయంగా రాలేకపోయినా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి సంఘీభావం తెలుపవచ్చని టిజెఎసి నేతలు భావిస్తున్నారు. సీతారం ఏచూరి వంటి జాతీయస్థాయి వామపక్షాల నేతలు ఈ ధర్నాకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంగళవారం నుంచి 25వ తేదీ వరకు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్వర్యంలో డిల్లీ సదస్సులు కూడా జరుగబోతున్నాయి. ఈ మూడు రోజుల సదస్సులకు కూడా అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ సదస్సు ముఖ్యోదేశ్యం తెలంగాణాలో తెరాస సర్కార్ అప్రజాస్వామిక పాలన గురించి చర్చించడం, దానిని మీడియాకు వివరించడం అని టిజెఎసి స్వయంగా తెలిపింది.