తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రకటించిన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భిన్నంగా స్పందించారు. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి స్పందిస్తూ ఒక ప్రముఖ విత్తన సంస్థ అధినేత తెరాస సర్కార్ నిర్ణాయాల వలన తన సంస్థకు లబ్ది కలుగుతున్నందుకు కేసీఆర్ కు ఈ అవార్డు వచ్చేలా చేశారని ఆరోపించారు.
దాసోజు శ్రవణ్ నిన్న గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రప్రభుత్వమో లేక కేంద్రప్రభుత్వ సంస్థో ఈ అవార్డు ఇవ్వలేదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఇస్తోంది. ఒక ప్రైవేట్ సంస్థ ఇస్తున్న అవార్డును కేంద్రప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెరాస నేతలు, మంత్రులు గొప్పలు చెప్పుకోవడం, అది చూసి గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించడం చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణా రాష్ట్రాన్ని ‘సీడ్ బౌల్’ (విత్తన ఉత్పత్తికేంద్రం) గా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆ విత్తన సంస్థకు లబ్ది చేకూర్చేదే. అందుకే ఆ సంస్థ కేసీఆర్ కు ఈ అవార్డు ప్రకటించింది. ఈవిధంగా కేసీఆర్ ను మంచి చేసుకొని రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం రంగం సిద్దమవుతోంది. నకిలీ విత్తనాలతో రైతులను నిలువునా ముంచుతున్న విత్తన సంస్థలు ఇస్తున్న ఆ అవార్డును కేసీఆర్ ఏవిధంగా అంగీకరిస్తారు? ఈ సంగతి తెలుసుకోకుండా గవర్నర్ నరసింహన్ ఆయనను ఎందుకు అభినందించారు?” అని అన్నారు.
“రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలే. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం పేద రైతుల భూములను బలవంతంగా గుంజుకొంటోంది. ఇంతవరకు కూడా ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేయకపోవడం వలన పంటలు వేసుకోవడానికి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతులను జైళ్ళకు పంపి, చేతులకు బేడీలు వేసి కోర్టుల చుట్టూ తిప్పింది. తెలంగాణా వ్యవసాయరంగం ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఇవేమీ గమనించకుండా వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ అవార్డుకు ఏవిధంగా ఎంపిక చేశారో అర్ధం కావడంలేదు,” అని సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి అన్నారు.