యూపిలోని ముజఫర్ నగర్ జిల్లాలో ఖతౌలి అనే ప్రాంతంలో రెండు రోజుల క్రితం జరిగిన ఉత్కల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 24 మంది మృతి చెందగా 156 మంది గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఘోర ప్రమాదానికి రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాధమిక విచారణలో తేలింది.
ఇంజనీరింగ్ సిబ్బంది మరమత్తులు జరుగుతున్నప్పుడు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. పట్టాలను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి తొలగించిన తరువాత మళ్ళీ దాని స్థానంలో కొత్త దానిని బిగించే ప్రయత్నంలో ఉండగా పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ ప్రెస్ వస్తుండటం చూసి పట్టాలను బిగించకుండా వదిలేసి అందరూ దూరంగా వెళ్ళిపోవడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.
అంత పెద్ద మరమత్తులు అక్కడ జరుగుతున్నప్పుడు రెండు వైపులా ఉండే స్టేషన్లలో తెలియబరచాలి. అప్పుడు ఆ ట్రాక్ మీదుగా రైళ్ళ రాకపోకలు జరుగకుండా రెడ్ సిగ్నల్ వేసి ఉంచి మరో ట్రాక్ మీదకు మళ్ళిస్తుంటారు. మరమత్తులు జరుగుతున్నప్పుడు కనీసం అరకిలోమీటరు దూరంలో ట్రాక్ వద్ద ఎర్రజెండాలు కూడా పెట్టాలి. ట్రాక్ మరమత్తులు జరుగుతున్నప్పుడు రెండు వైపులా ఎర్రజెండాలు పట్టుకొని హెచ్చరించేవారిని ఉంచాలి. అదీ చేయలేదు. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా రెండు మూడు రోజులుగా పట్టాల మరమత్తు పనులు చేస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది.
ఈ ప్రమాదానికి మరో ప్రధాన కారణం స్థానిక రైల్వే ఇంజనీరింగ్ మరియు ట్రాఫిక్ విభాగాల మద్య సమన్వయలోపం అని విచారణ అధికారులు గుర్తించారు. ఇక ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా స్థానిక సెక్షన్ లోని రైల్వే సేఫ్టీ ఆఫీసర్ అనుమతి తీసుకోవాలి. కానీ అది కూడా తీసుకోలేదని తెలుస్తోంది. అటువంటి సమయంలో సేఫ్టీ విభాగం సిబ్బంది తమ పరిధిలో అనుమతి లేకుండా మరమత్తులు జరుగుతున్నట్లు గుర్తించి తక్షణమే తమపై అధికారులను అప్రమత్తం చేయాలి. వారూ నిర్లక్ష్యం వహించారు. కనుక కేవలం నిర్లక్ష్యం, మానవ తప్పిదాల కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు స్పష్టం అవుతోంది.
ఈ ప్రమాదానికి కారణమైన 8 మంది అధికారులు, సిబ్బంది గుర్తించి సస్పెండ్ చేసినట్లు రైల్వే బోర్డు (ట్రాఫిక్) సభ్యుడు మహ్మద్ జంషెడ్ మీడియాకు తెలిపారు. సస్పెండ్ అయినవారిలో బోర్డు కార్యదర్శి స్థాయి అధికారి కూడా ఒకరున్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయి విచారణ మొదలవుతుందని ఆ నివేదిక వచ్చిన తరువాత మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉందని చెప్పారు.
ఆ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ గ్యాస్ కట్టర్ వంటి పరికరాలు కనబడటంతో అది ఉగ్రవాదులో లేదా మావోయిస్టుల చర్య అయ్యుండవచ్చనే వార్తలు వెలువడ్డాయి. కానీ రైల్వే సిబ్బందే కారణం కావడం విస్మయం కలిగిస్తుంది. వారి నిర్లక్ష్యం ఖరీదు 24 నిండు ప్రాణాలు. వారి నిర్లక్ష్యం కారణంగా రైల్వేశాఖకు కోట్ల రూపాయలు నష్టం కలిగింది.