రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ లోని బాలానగర్ ఫ్లై-ఓవర్ కు శంఖుస్థాపన చేయనున్నారు. రూ.104 కోట్లతో వ్యయంతో ఆరులేన్లతో ఐ.డిపిఎల్ నుంచి బాలా నగర్ చౌరస్తా, ఫతే నగర్ చౌరస్తా మీదుగా సామ్రాట్ హోటల్ వరకు ఈ ఫ్లై-ఓవర్ నిర్మించబడుతుంది.దీని కోసం సుమారు 8 ఎకరాలు భూమి సేకరించవలసి ఉంటుంది. ఆ భాద్యతను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చేపట్టింది. ఈ బ్రిడ్జి నిర్మింపబడే ప్రాంతం హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే వ్యాపార, పారిశ్రామిక ప్రాంతం కావడంతో స్థలసేకరణకే రూ.265 కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే రెండేళ్ళలోపే ఈ ఫ్లై-ఓవర్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది.
దీనికి శంఖుస్థాపన చేసిన తరువాత తెరాస బారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. కనుక తెరాస నేతలు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడాన్ని ప్రభుత్వం నిషేదించినా, మంత్రి కేటిఆర్ వద్దని వారిస్తున్నా తెరాస నేతలు బాలానగర్ పరిసర ప్రాంతాలలో కేటిఆర్ కు స్వాగతం చెపుతూ అనేక ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.