ఆర్ధిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నంలో తనపై తానే హత్యా ప్రయత్నం చేయించుకొన్న కాంగ్రెస్ యువనేత విక్రం గౌడ్ కు శనివారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్ళాలని షరతులు విధించింది. వాటికి అతను అంగీకరించడంతో బెయిల్ మంజూరు చేసింది.
విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత ఆగస్ట్ 3న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్ అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. విక్రం గౌడ్ తన సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఈ ఉపాయం అమలుచేసినప్పటికీ అది బెడిసికొట్టింది. ఇప్పుడు మళ్ళీ అప్పులవాళ్ళ నుంచి ఒత్తిడి ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. పైగా ప్రతీవారం పోలీస్ స్టేషన్ వెళ్ళి వస్తుండ వలసి రావడంతో చేజేతులా కొత్త సమస్యలను సృష్టించుకొన్నట్లయింది.