తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక అయ్యారు. భారత ఆహార, వ్యవసాయ మండలి ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డును అందుకోబోతున్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన కమిటీ ఈ అవార్డుకు కేసీఆర్ ను ఎంపిక చేసింది.
తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేసీఆర్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొంటూ చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పధకాలు, కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వామినాథన్ కమిటీ పేర్కొంది. తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వలన రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కమిటీ తెలిపింది.
సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం డిల్లీలో తాజ్ ప్యాలెస్ లో జరుగబోయే అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ అవార్డు అందుకొంటారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వ్యవసాయాభివృద్ధికి తద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదపడే పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువుల పూడిక తీసి వాటిలో మంచి నీళ్ళు నింపడం ద్వారా పరిసర ప్రాంతాలలో పంటలకు నీళ్ళు అందడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరిగాయి. ఆ కారణంగా ఎండిపోయిన బోరుబావులలో మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. వాటితో రైతులు పంటలు పండించుకొంటున్నారు.
పూడికతీసిన చెరువులలో చేపపిల్లల పెంపకం చేపట్టడం ద్వారా మత్సకారులకు ఉపాధి కల్పించారు. ఇక వ్యవసాయ భూముల సర్వే, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాల నిర్మాణం, వాటి ద్వారా రైతులకు ఏటా ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ.8,000 ఇవ్వాలనే ప్రతిపాదన, గొర్రెల పంపిణీ, అలాగే గీత కార్మికులకు తాటి, ఈత చెట్లు పెంచుకొనేందుకు భూములు కేటాయించడం, చేనేత, మరమగ్గాల కార్మికులకు బతుకమ్మ చీరల నేసే బాధ్యత అప్పగించడం ద్వారా పని కల్పించడం వంటి అనేక వినూత్నమైన నిర్ణయాలు, ఆలోచనలు అమలుచేస్తూ తెలంగాణా గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడానికి కేసీఆర్ చేస్తున్న కృషిని భారత ఆహార, వ్యవసాయ మండలి సరిగ్గానే గుర్తించింది.
తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విమర్శిస్తున్న వారికి ఈ అవార్డే సమాధానం చెపుతుంది. అందుకు యావత్ తెలంగాణా ప్రజల తరపున మైతెలంగాణా.కామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతోంది. ఆయన సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకొంటోంది.