దేశంలో అనేక మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మించి ‘మెట్రో గురు’గా పేరొందిన ఈ శ్రీధరన్ కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రకటించిన మెట్రో రైల్ పాలసీ గురించి, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి, ఏపిలో చేపట్టబోతున్న మెట్రో ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాలు చెప్పారు.
“కేంద్రప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైల్ పాలసీ కాగితాల మీద బాగానే ఉంటుంది కానీ ఆచరణ సాధ్యం కాదు. మెట్రో ప్రాజెక్టుల నిర్వహణ ఎప్పుడూ లాభదాయకంగా ఉండవు. ప్రభుత్వాలు వాటిని సామాజిక బాధ్యతగానే నిర్వహించవలసి ఉంటుంది. కొత్త పాలసీలో చేర్చిన కొన్ని నిబందనల వలన మెట్రో లాభదాయకత పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు మెట్రో ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావు. కొత్త నిబందనలు అమలులోకి వస్తే కొత్త మెట్రో ప్రాజెక్టులు నిర్మించడం ఇంకా కష్టం కావచ్చు,” అని చెప్పారు.
“పిపిపి విధానంలో మెట్రో రైల్ నిర్వహించడం నష్టదాయకం అని చెప్పడానికి హైదరాబాద్ మెట్రో రైల్ చక్కటి ఉదాహరణ. అందుకు అనేక కారణాలున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టును ఎప్పటి నుంచి ఆపరేట్ చేయడం మొదలుపెడతారో అప్పటి నుంచి ఎల్ అండ్ టి సంస్థ బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడం మోదలుపెట్టవలసి ఉంటుంది. అందుకే అది మెట్రో రైళ్ళను తిప్పడానికి భయపడుతోంది.,” అని అన్నారు.
“ఏపి సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు పనుల నుంచి నేను 6 నెలల క్రితమే తప్పుకొన్నాను. ప్రభుత్వం మెట్రోకి బదులు లైట్ రైల్ ను ఏర్పాటు చేయాలనుకొంటోంది. దాని వలన ఇంకా నష్టమే తప్ప ఏమాత్రం లాభం ఉండదు. కొత్త మెట్రో పాలసీ అమలులోకి వస్తే వైజాగ్, విజయవాడ మెట్రో పనులు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం కనబడుతోంది,” అని అన్నారు.