దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసులలో విచారణ గురించి ఇప్పుడు మీడియా కూడా పట్టించుకోవడం లేదు. దాని దృష్టి వేరే అంశాలపైకి మళ్ళిపోయింది. కనుక ఇప్పుడు ఆ కేసులకు సంబంధించిన వార్తలు, చర్చలు వినబడటం లేదు. కనబడటం లేదు. కానీ మళ్ళీ చాలా రోజుల తరువాత వాటి గురించి ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మాట్లాడారు. “ప్రస్తుతం ఆ కేసుల విచారణ చాలా చురుకుగా సాగుతోంది. ఇంతవరకు 11 కేసులు నమోదు చేసి 22మందిని అరెస్ట్ చేశాము. ప్రస్తుతం ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురు చూస్తున్నాము. ఈలోగా న్యాయనిపుణులతో కూడా చర్చిస్తున్నాము. ఈ కేసులలో విచారించిన సినీ ప్రముఖులు నిందితులా లేక సాక్షులుగా పరిగణిస్తామా..అనే విషయం ఇప్పుడే చెప్పలేము. ఈ డిశంబర్ నెలాఖరులోగా ఈ కేసులలో ఛార్జ్-షీట్లు దాఖలు చేస్తాము,” అని చెప్పారు.
అకున్ సబర్వాల్ చెప్పిన ప్రకారం మరో 4 నెలల వరకు కోర్టులో ఛార్జ్-షీట్లు వేయడం లేదని స్పష్టం అయ్యింది. విచారణకు హాజరైనవారిని నిందితులో సాక్షులో చెప్పలేమనడం చూస్తే మునుపటి సీరియస్ నెస్ లేదని స్పష్టం అవుతోంది. ఒకవేళ ఈ కేసులను కూడా ఓటుకు నోటు కేసులలాగే అటకెక్కించేయదలిస్తే, డిశంబరు నాటికి కూడా దర్యాప్తు పూర్తికాకపోవచ్చు. ఆ కేసులాగే దర్యాప్తు కొనసాగుతూనే ఉండిపోవచ్చు. అయితే ఇంత హడావుడి ఎందుకు చేసినట్లు? అంటే సమాధానం అందరికీ తెలిసిందే. ఈ కేసులు, దర్యాప్తు సంగతి ఎలా కొనసాగినప్పటికీ హైదరాబాద్ లో మళ్ళీ మత్తుమందుల అమ్మకాలు జరుగకుండా నివారించగలిగితే ప్రజలు చాలా సంతోషిస్తారు.