చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతుంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ ఈసారి బాబుకు చాలా కీలక సమయంలో పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చేరు.
కర్నూలు జిల్లాలో నంద్యాల శాసనసభ ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఉదృత ప్రచారంతో వైకాపాది పైచెయ్యిగా కనిపిస్తోంది. చివరి అస్త్రంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను రంగంలో దింపుతారని అందరూ భావిస్తుంటే, తాను ఈ ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో తెదేపా నేతలు కంగుతిన్నారు.
అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో బాలయ్య బాబును రంగంలోకి దింపారు. కానీ ‘ఆయన ఏమీ తెలియని అమాయకుడని, అందుకే తన తండ్రిని మోసం చేసిన చంద్రబాబు నాయుడు వెనుకే తిరుగుతున్నారని, బాబు ఏమి చెపితే అదే మాట్లాడుతున్నాడని’ వైకాపా ఎమ్మెల్యే రోజా ముందే అనేశారు. అందుకు తగ్గట్లుగానే బాలయ్య బాబు బహిరంగంగా ప్రజలకు నోట్లు పంచడం, అందరి ముందు అభిమాని చెంప చెళ్ళుమనిపించడంవంటి పనులు చేయడంతో వైకాపా దానిని కూడా తనకు అనుకూలంగా మలుచుకొని గట్టిగా ప్రచారం చేసుకొంటోంది.
ఈ ఉపఎన్నికలలో తెదేపాకు మద్దతు ఇవ్వకూడదనే పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కూడా రోజా చక్కటి బాష్యం చెప్పారు. తెదేపా ఎలాగూ వైకాపా చేతిలో ఓడిపోబోతోందని గ్రహించినందునే ఎప్పుడూ తెదేపాకు వంతపాడే పవన్ కళ్యాణ్ ఈసారి దూరంగా ఉన్నాడని రోజా వివరించింది. తెదేపాకు మద్దతు ఇచ్చిన తరువాత అది ఓడిపోతే ఆ అపకీర్తి తన జనసేనకు కూడా చుట్టుకొంటుందనె భయంతోనే పవన్ కళ్యాణ్ తెదేపాకు హ్యాండ్ ఇచ్చారని రోజా వివరించారు.
పవన్ కళ్యాణ్ ఏ కారణంతో ఈ ఎన్నికలలో తెదేపాకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం తెదేపా పరిస్థితి, రోజా చెప్పిన కారణం కలిపి చూస్తే ఆమె చెప్పింది నిజమేననిపించక మానదు.