యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పి.హెచ్.డి విద్యార్ధి రోహిత్ వేముల గత ఏడాది జనవరి 16న ఆత్మహత్య చేసుకొన్నప్పుడు దేశంలో ఎక్కడెక్కడి నుంచో రాజకీయ నేతలు వచ్చి వాలిపోయి చాలా హడావుడి చేశారు. అతనిపై ప్రేమతో వారు రాలేదు...అతను దళితుడు అని భావించి వారు కాకుల్లాగా యూనివర్సిటీలో వాలిపోయి కాకిగోల చేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత అతను దళితుడు కాదని పోలీసులు నివేదిక ఇవ్వడం వలననో లేక ఇక ఆ సంఘటన ద్వారా తమకు రాజకీయ మైలేజీ లభించదని భావించినందునో ఏ రాజకీయ నాయకుడు మళ్ళీ యూనివర్సిటీ వైపు వెళ్ళలేదు..రోహిత్ వేములకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు. అతని ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరలేదు.
రోహిత్ వేముల మృతిపై విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన రూపన్వాలా కమిటీ కూడా అతనికి చాలా అన్యాయం చేసిందనే చెప్పక తప్పదు. అది కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లుగా నివేదికను తయారుచేసి ప్రభుత్వం చేతిలో పెట్టింది. అతను ప్రపంచవ్యవహార తీరు పట్ల విసిగి వేసారిపోయి విరక్తితో ఆత్మహత్య చేసుకొన్నాడని దానిలో పేర్కొంది. అతని ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదని, ఎవరూ బాధ్యులు కారని క్లీన్ చిట్ కూడా ఇచ్చింది.
రోహిత్ వేముల యూనివర్సిటీ అధికారుల వేధింపులను, వారి కులవివక్షను భరించలేకనే ఆత్మహత్య చేసుకొన్నాడని అందరికీ తెలుసు. అయితే అతను కూడా తన లేఖలో ఎవరూ బాధ్యులని పేర్కొనకపోవడం వలన అతను లోకంతో సర్దుకుపోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొన్నాడని నివేదికలో పేర్కొంది.
ఆ నివేదిక అంతకంటే గొప్పగా ఉంటుందని ఎవరూ ఆశించలేదు కూడా. కానీ రోహిత్ వేముల చనిపోయినప్పుడు యూనివర్సిటీకి వచ్చి మొసలి కన్నీళ్లు కార్చిన కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఆ నివేదిక గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఇటువంటి రాజకీయ నాయకులను విద్యార్ధులు నమ్ముకొంటే చివరికి వారే అన్ని విధాల నష్టపోతారని గ్రహిస్తే మంచిది. కనుక యూనివర్సిటీ విద్యార్ధులు ఈ రాజకీయ పార్టీలకు, నేతలకు దూరంగా ఉంటూ తమ లక్ష్యాలను సాధించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తే వారికీ, వారి కన్నవారికీ కూడా మంచిది.