ప్రముఖ తెలుగు సినీ నటుడు జగపతి బాబుకు ఊహించని కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో సహా కొంత మంది ఉన్నతాదాయ వర్గాలకు చెందినవారు హైదరాబాద్, కూకట్ పల్లిలో లోధా బిల్డర్స్ నిర్మించిన విలాసవంతమైన బెలిజా అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. ఆ సంస్థకు, వారికి జరిగిన ఒప్పందం ప్రకారం 10.5 ఎకరాల విస్తీర్ణంలో వాటిని నిర్మించి ఇవ్వాలి. మొదట వాటిని ఆవిధంగానే నిర్మించినప్పటికీ ఆ సంస్థ ఆ స్థలంలో మూడు ఎకరాలను తీసుకొని మెరిడియన్ అపార్ట్మెంట్ ను నిర్మించింది. అంతటితో ఆగకుండా జి.హెచ్.ఎం.సి. నిబంధనలకు విరుద్దంగా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించింది. అది బెలిజా అపార్ట్మెంట్ వాసులతో చేసుకొన్న ఒప్పందాన్ని ఆ సంస్థ ఉల్లంఘించినట్లు అయిందని జగపతి బాబు ఆరోపించారు. లోధా సంస్థ బెలిజా అపార్ట్మెంట్స్ కు సమీపంలోనే కొత్తగా నిర్మిస్తున్న ఎండ్ అపార్ట్మెంట్స్ ను కూడా తమ ప్రాంగణంలోనే కలిపేస్తోందని దాని వలన తమ ప్రైవసీ దెబ్బతీస్తోందని అన్నారు. తమకు జరిగిన ఈ అన్యాయం గురించి జి.హెచ్.ఎం.సి.కమీషనర్ కు పిర్యాదు చేస్తామని అవసరమైతే న్యాయపోరాటం కూడా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.