ముందు ఆ సంగతి చూడండి: కేసీఆర్

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టి.ఎస్.పి.ఎస్.సి.) త్వరలో 84 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నందున దాని చైర్మన్ ఘంటా చక్రపాణి, ఇతర అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యి కొన్ని సూచనలు చేశారు. గత చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూలు, ఎంపిక ప్రక్రియలో ఎక్కడా లోపాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఈ ప్రక్రియపై న్యాయవివాదాలను నివారించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ వివాదాలు ఎదురైతే వాటిని సమర్ధంగా ఎదుర్కోవడానికి టి.ఎస్.పి.ఎస్.సి. సిద్దంగా ఉండాలని కోరారు. నోటిఫికేషన్ జారీ చేయకముందే న్యాయనిపుణులతో చర్చించి వాటిలో ఏవైనా లోపాలున్నట్లయితే సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తుంటాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ తన మాట నిలబెట్టుకోవడంలేదని వాదిస్తూ ధర్నాలు చేస్తుంటాయి. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవగానే ఎవరో ఒకరు ఏదో ఒక సాకుతో కోర్టులలో పిటిషన్లు వేస్తుంటారు. దానితో ఆ ప్రక్రియ నిలిచిపోతుంది. ఉద్యోగాలు భర్తీకావు. 

దానికీ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్నే నిందిస్తుంటాయి. అది ఉద్దేశ్యపూర్వకంగానే లోపభూయిష్టంగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ, ఈ ప్రక్రియను న్యాయవివాదాలలో ఇరికించి ఉద్యోగాల భర్తీ చేయకుండా కపట నాటకాలు ఆడుతోందని, మళ్ళీ ప్రతిపక్షాలు తమను అడ్డుకొంటున్నాయని నిందించడం అలవాటుగా మారిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి న్యాయవివాదాలకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే న్యాయనిపుణుల సలహాలు స్వీకరించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం సరైనదే.