పబ్లిక్ గానే బాలయ్య డబ్బులు పంపిణీ!

తెదేపా సాక్షి మీడియాకు అడ్డంగా దొరికిపోయింది. నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తున్న నటుడు, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా సమక్షంలోనే ప్రజలకు డబ్బులు పంచుతూ కెమెరాలకు చిక్కారు. సహజంగానే ఈవార్తను సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై ఎన్నికల కమీషన్ కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉండటంతో తెదేపాలో కూడా ఆందోళన మొదలై ఉండవచ్చు కానీ ఇంతవరకు అది బయటపడలేదు.

డబ్బులు పంచింది ఎవరో అనామకనేత అయితే తెదేపా సులువుగా తప్పించుకోగలిగేది కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వియ్యంకుడు, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ బహిరంగంగా ప్రజలకు డబ్బులు పంచుతూ మీడియా కెమెరాలకు చిక్కడంతో తప్పించుకోవడం కష్టమే. దీనిపై బాలకృష్ణ, తెదేపా అధిష్టానం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. తీవ్ర ఎండల్లో బాలయ్య రోడ్ షోలకు హాజరైన ప్రజలకు నీళ్ళ బాటిల్స్ తెప్పించడానికి డబ్బులు పంచుతున్నారని బుకాయిస్తుందేమో?