మియాపూర్ భూతం తెరాసను విడిచిపెట్టదా?

 మియాపూర్ భూకుంభకోణం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దాని తరువాత మొదలైన టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ విచారణ కేసుల వలననో లేదా మరో కారణం వలననో దాని గురించి ఇప్పుడు మీడియాలో కూడా పెద్దగా వార్తలు రావడం లేదు. కారణాలు ఏవైతేనేమి ప్రజలు కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలేదు. కానీ మియాపూర్ భూతం మాత్రం ఇప్పట్లో తెరాస సర్కార్ ను విడిచిపెట్టేలా కనబడటం లేదు. 

ప్రముఖ న్యాయవాది, భాజపా నేత రఘునందన్ రావు హైకోర్టులో దానిపి ఒక ప్రజాహిత వాజ్యం వేశారు. ఈ కుంభకోణంలో చాలామంది పెద్దలున్నారని, సిఐడి చేత విచారణ జరిపించడం వలన దానిలో దోషుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండదని, కనుక ఈ కేసుపై సిబిఐ  దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్ లో కోరారు. 

ఆ పిటిషన్ పై విచారించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి, సిబిఐకి ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.