తెలంగాణా ప్రాజెక్టులకు కేంద్రం లైన్ క్లియర్?

తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. వాటిలో శ్రీరాంసాగర్, వరద కాలువ, పెద్దవాగు, ర్యాలివాగు, మట్టదివాగు, పాలెం వాగు, గొల్లవాగు, కొమరం భీం, దేవాదుల, భీమా మొదలైన 11 ప్రాజెక్టులున్నాయి. అవికాక మరో 28 సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

తెరాస సర్కార్ రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే మోడీ సర్కార్ కూడా దేశవ్యాప్తంగా వివిద దశలలో ఉన్న పలుసాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎస్‌వై) పథకం ప్రారంభించింది. ఈ పధకంలో భాగంగా దేశంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులలో చివరిదశ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి వాటికి బారీగా నిధులు మంజూరు చేస్తోంది. అదేవిధంగా ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసిన ప్రాజెక్టులకు కూడా నిధులు అందిస్తోంది. వాటిలో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన ఈ 11 ప్రాజెక్టులకు కేంద్రం తనవంతు వాటాగా రూ.574 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం.

డిల్లీలో నిన్న జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో మోడీ సర్కార్ ఒక ముఖుఅమైన నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా నిర్మితమవుతున్న 99 ప్రాజెక్టులకు 2019 డిసెంబరులోగా పూర్తిచేసేందుకు అవసరమైన నిధులు అందించేందుకు నాబార్డు రూ.9,020 కోట్లు బాండ్లు ద్వారా నిధుల సమీకరించేందుకు ఆమోదం తెలిపింది. వాటిలో తెలంగాణా ప్రాజెక్టులకు మరో రూ.653 కోట్లు రాబోతున్నాయని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంకా కొత్తగా చేపట్టబోతున్న 28 సాగునీటి ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారుచేసి కేంద్రానికి పంపించితే వాటిని కేంద్రం పరిశీలించి నిధుల విడుదల చేస్తుంది. కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకొన్న నిర్ణయం వలన తెలంగాణా ప్రాజెక్టులకు మొత్తం రూ.1,100 కోట్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం.