సూర్యాపేటలో కాంగ్రెస్, తెరాస నేతలు డిష్యూం డిష్యూం!

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా నిన్న సూర్యాపేటలో పబ్లిక్ క్లబ్ లో జెండా ఎగురవేయడానికి కాంగ్రెస్, తెరాస నేతలు పోటీ పడటంతో రెండు వర్గాల మద్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ పాలనలో సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కమిటీలో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉండేవారు. కానీ తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత క్లబ్ కమిటీ తెరాస నేతలతో నిండిపోయింది. దానిపై క్లబ్ కమిటీ మాజీ కార్యదర్శి కె వేనరెడ్డి హైకోర్టుకు వెళ్ళగా, పాత సభ్యులనే అంటే కాంగ్రెస్ నేతలనే కమిటీలో కొనసాగవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చింది. 

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా నిన్న క్లబ్ ఆవరణలో జెండా ఎగురవేయడానికి కె వేనరెడ్డి కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడకు చేరుకొన్నారు. కాసేపటికే తెరాస నేతలు కూడా అక్కడికి చేరుకొని తామే జెండా ఎగురవేస్తామని పట్టుబట్టడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ సంగతి తెలుసుకొని పోలీసులు అక్కడకు చేరుకొని కె వేనరెడ్డి వర్గాన్ని అదుపులో తీసుకొని స్టేషన్ కు తరలించారు. 

ఈ సంగతి తెలుసుకొన్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.దామోదర్ రెడ్డి తన అనుచరులతో కలిసి సూర్యాపేట జంక్షన్ లో గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షకు కూర్చొన్నారు. పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ దామోదర్ రెడ్డి స్పృహ తప్పిపడిపోవడంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల చర్యలను కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మావతి ఖండించారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసుల చేత కాంగ్రెస్ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేతలందరినీ తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

విచిత్రమేమిటంటే, హైకోర్టు ఆదేశానుసారం కాంగ్రెస్ నేతలే క్లబ్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నప్పుడు వారికే అక్కడ జెండా ఎగురవేసే హక్కు ఉంటుంది. కానీ తెరాస నేతలు అక్కడికి వచ్చి దౌర్జన్యం చేశారు. అందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేయవలసి ఉండగా, క్లబ్ కమిటీ సభ్యులైన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. 

జెండా ఎగురవేసేందుకు పోరాడవలసిన కాంగ్రెస్ నేతలు తమ వారిని పోలీసులు విడుదల చేయాలని ధర్నాలు చేయడం మరో విశేషం. 

అన్నిటికంటే విషాదకరమైని విషయం ఏమిటంటే, ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం యావత్ భారతీయులు కలిసికట్టుగా పోరాడితే , ఇప్పుడు మువ్వన్నెల జెండా సాక్షిగా రాజకీయ నేతలు కీచులాడుకొన్నారు. అదే..అందరూ కలిసి జెండా ఎగురవేసి ఉంటే ఎంత అద్భుతంగా ఉండేదో కదా? అసోం వరదలలో పీకల లోతు నీటిలో నిలబడి స్కూలు విద్యార్ధులు జెండా ఎగురవేసినందుకు యావత్ దేశప్రజలు మెచ్చుకొంటుంటే, ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన మన రాజకీయ నేతలు నిసిగ్గుగా జెండా సాక్షిగా కీచులాడుకొన్నారు.