ఆ ప్రకటనతో నాకు సంబందం లేదు: డిఎస్

తెరాస రాజ్యసభ సభ్యుడు, తెరాస సర్కార్ సలహాదారు డి. శ్రీనివాస్ రెండవ కుమారుడు డి. అరవింద్ నిన్న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఒక జాతీయ న్యూస్ పేపర్ లో ఒక ప్రకటన ఇచ్చారు. దానిలో దేశప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడీని బలపరచాలని ఆయన వెంట నడవాలని అరవింద్ కోరారు. దీనిపై డిఎస్ స్పందిస్తూ, ‘ఆ ప్రకటనతో నాకు ఎటువంటి సబంధమూ లేదు. నేను తెరాస విడిచిపెట్టను. నా కొడుకు ఏమీ చిన్న పిల్లాడు కాడు కనుక అతను ఆవిధంగా ఎందుకు ప్రకటన ఇచ్చాడో అతనినే అడిగితే మంచిది,” అని అన్నారు. అరవింద్ కూడా ఆ ప్రకటనతో తన తండ్రికి ఎటువంటి సంబందమూ లేదని, ఇప్పటికిప్పుడు తాను భాజపాలో చేరాలనుకోవడం లేదని అన్నారు.

డిఎస్, ఆయన పెద్ద కుమారుడు డి సంజయ్ ఇద్దరూ తెరాసలోనే ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వారిరువురూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వచ్చిన వార్తలను డిఎస్ ఈ మద్యనే ఖండించారు. ఈ ప్రకటన చూసిన తరువాత వారి దృష్టి భాజపాపై ఉందని స్పష్టం అవుతోంది. కానీ తాము తెరాసలోనే కొనసాగుతామని తండ్రీకొడుకులు చెపుతున్నారు. కానీ వారి చేతలు మరొకవిధంగా ఉన్నాయి.