ఆమె దేశ ప్రధాని భార్య. కానీ ఎక్కడకు వెళ్ళినా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. అదేదో గొప్ప కోసం కాదు. భర్త ఆమెను విడిచిపెట్టి చాలా కాలం అయ్యింది. కనుక భర్త దేశానికి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆమె ఒక సామాన్య మహిళలాగే జీవనం సాగిస్తున్నారు. ఆమె పేరు యశోదా బెన్. ఆమె భర్త పేరు నరేంద్ర మోడీ. అవును భారత ప్రధాని నరేంద్ర మోడీ భార్యకే ఈ పరిస్థితి నెలకొని ఉంది.
మోడీ ఆమెను తిరస్కరించినప్పటికీ ఆమె నేటికీ తన భర్త ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు చేస్తూనే ఉండటం విశేషం. కృష్ణాష్టమి సందర్భంగా ఆమె మధురలోని రంగేశ్వర్, కెలాదేవి ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడికి తన సోదరుడు అశోక్ తో కలిసి మేవాడ్ ఎక్స్ ప్రెస్ లో వచ్చి పూజలు ముగిసిన తరువాత అక్కడి నుంచి శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి వెళ్ళారు. అక్కడ కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్న తరువాత వారు మళ్ళీ అహ్మదాబాద్ తిరిగివెళ్ళిపోతారు.
ఒక ప్రధానమంత్రి భార్య ఇంత నిరాడంబరంగా జీవిస్తుండటం విశేషమే. ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లి హీరాబెన్ పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కనపరుస్తారు. అలాగే దేశంలో అన్ని కులమతాల, ప్రాంతాల మహిళల పట్ల చాలా గౌరవం చూపిస్తుంటారు. కానీ అర్దాంగి యశోదా బెన్ పట్ల ఎందుకు అంత నిరాదారణ చూపుతున్నారో ఎవరికీ తెలియదు. ఆమెకు కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే అది ఆయనకే గౌరవంగా ఉంటుంది కదా?