మళ్ళీ ఆసుపత్రిలో చేరిన కరుణానిధి

తమిళనాడులో ప్రధానప్రతిపక్ష పార్టీ డిఎంకె పార్టీ అధినేత ఎం.కరుణానిధి (94) బుదవారం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆయనను ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన గత ఏడాది కాలంగా శ్వాస సంబధిత సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది డిశంబర్ నెలలో ఇదే సమస్యతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కానీ అతికష్టం మీద వైద్యులు ఆయనను కాపాడగలిగారు. తన ఆరోగ్యపరిస్థితి దిగజారుతుండటంతో ఆయన తన రెండవ కుమారుడు స్టాలిన్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని, ఎండోస్కోపీ చేసి ఈరోజు సాయంత్రమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. 

ఒకప్పుడు తమిళనాడులో జయలలిత, కరుణానిధిల మద్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండేది. జయలలిత మృతి చెందడం, కరుణానిధి వృద్దాప్యం కారణంగా రాజకీయాలకు దూరం అయిన తరువాత రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన శూన్యత నెలకొని ఉంది. స్టాలిన్ డిఎంకె పగ్గాలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితులను తన పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో విఫలం అయ్యారు. కనుక డిఎంకెను ఆయన తన తండ్రి అంత సమర్ధంగా నడిపించగలరా లేదా? డిఎంకెకు మళ్ళీ పూర్వ వైభవం కల్పించగలరా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.