చిన్నారి చంద్రశేఖర్ మృత్యుంజయుడు

గుంటూరు జిల్లా ఉమ్మడివరం గ్రామంలో నిన్న సాయంత్రం 4 గంటలకు బోరుబావిలో పడిన రెండేళ్ళ చంద్రశేఖర్ ను  సహాయసిబ్బంది సురక్షితంగా బయటకుతీసుకురాగలిగారు. బోరుబావికి సమాంతరంగా మరో పెద్దగొయ్యి త్రవ్వి తెల్లవారుజామున 3గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. బాలుడికి ఎటువంటి గాయాలు కాలేదు. కొద్దిగా నీరసంగా ఉన్నాడు. ఇంత ప్రమాదం నుంచి బయటపడినా ఆ చిన్నారి బాలుడు ఏమాత్రం ఏడవలేదు. తన తల్లిని చూడగానే చిన్నికృష్ణుడులాగ చిద్విలాసంగా చిర్నవ్వులు చిందించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు...సంతోషంలో మునిగిపోయారు.

అతనిని ఆసుపత్రిలో 24 గంటలు ఉంచి ఆరోగ్యపరిస్థితిని గమనించిన తరువాత చిన్నారిని తల్లితండ్రులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. బాలుడిని బోరుబావిలో నుంచి బయటకు తీసేవరకు రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్, డి.ఎస్.పి. ఇంకా అనేక మంది అధికారులు అక్కడే ఉండి సహాయచర్యలను పర్యవేక్షించారు. తమ కుమారుడిని రక్షించినందుకు బాలుడి తల్లితండ్రులు ఎన్.జి.ఆర్.ఎఫ్., సహాయ సిబ్బంది, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. 

చిన్నారి చంద్రశేఖర్ కధ సుఖాంతం అవడం అందరికీ ఆనందం కలిగించే విషయమే. అయితే ఇకనైనా రెండు తెలుగు రాష్ట్రాలలో తెరిచి ఉంచిన బోరుబావులను మూసివేయడానికి రెండు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపడితే మళ్ళీ ఇత్వంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. బోరుబావిలో పడిన పిల్లలు అందరూ చంద్రశేఖర్ లాగ మృత్యువును జయించలేరు. చాలా మంది చిన్నారిలా బోరుబావులకు బలైపోతుంటారు. కనుక ప్రజలు కూడా దీనిని సామాజిక బాధ్యతగా తీసుకొని తమతమ గ్రామాలలో తెరిచి ఉంచిన బోరుబావులను మూసివేసేందుకు కదిలిరావాలి.