స్వాతంత్ర్యదినం సందర్భంగా సంప్రదాయం ప్రకారం గవర్నర్ నరసింహన్ ‘ఎట్ హోం’ పేరిట రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, వివిధ రంగాలలో ప్రముఖులకు మంగళవారం సాయంత్రం రాజ్ భవన్ లో అల్పాహార విందు ఇస్తున్నారు. దీనికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కూడా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించడంతో ఆయన కూడా వచ్చారు. కనుక ఈ విందు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, తెరాస ఎంపీలు కేశవరావు, డీఎస్ హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, భాజపా నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు.
త్వరలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా గవర్నర్ల నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపద్యంలో గవర్నర్ నరసింహన్ ఇస్తున్న ఆఖరి విందు ఇదేనేమో?