వాళ్ళు జెండాకు..వాళ్ళకు మనం సెల్యూట్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశప్రజలందరూ జెండా పండుగ జరుపుకొంటున్నారు. అందులో వింతేమీ లేదు కానీ వరదలు ముంచెత్తుతున్న ఈశాన్యభారత దేశంలో ఒక స్కూలు ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు, కొందరు పిల్లలు నడుం లోతు నీళ్ళలో నిలబడి జెండాపండుగ చేసుకోవడాన్ని చూస్తే ఎవరికైనా మనసు పులకించకమానదు. 

అసోంలో వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వాటిలో డుబ్రి జిల్లాలోని బోరోకలియా నష్కరా అనే గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. వరదల కారణంగా ఆ పాఠశాలలోకి కూడా నీళ్ళు చేరాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా నడుంలోతు నీళ్ళు నిలిచి ఉన్నాయి. కానీ ఈరోజు ఆగస్ట్ 15 పాఠశాలలో జెండా ఎగురవేసే ఆనవాయితీని కొనసాగించడం కోసం ఆ పాఠశాల ప్రిన్సిపాల్     త‌జెమ్ సిక్ద‌ర్‌, ఉపాద్యాయులునృపేన్ రాభా, జాయ్‌దేవ్ రాయ్‌, మిజ‌నూర్ రెహ‌మాన్‌ మూడవ తరగతి చదువుతున్న విద్యార్ధులు జిఆరుల్ అలీ ఖాన్, హైదర్ ఆలీఖాన్ అక్కడికి చేరుకొని మువ్వన్నెల జెండా ఎగురవేసి, జాతీయగీతం ఆలపించారు. ఆ పరిస్థితులలో అంతకు మించి మరేమీ చేయలేనందున పిల్లలను పంపించి వేశామని ప్రిన్సిపాల్ త‌జెమ్ సిక్ద‌ర్‌ చెప్పారు.

అసోంలోనే మరో ప్రాంతంలో కూడా మోకాలిలోతు నీళ్ళలో నిలబడి ఉపాద్యాయులు, విద్యార్ధులు, గ్రామస్తులు జెండా ఎగురవేసి జాతీయగీతం ఆలపించారు.  ఈ ఫోటోలను చూసినట్లయితే నిబద్దతకు, దేశభక్తికి ఇంతకు మించి గొప్ప ఉదాహరణ ఏమి ఉంటుంది? అనిపించకమానదు కదా. వాళ్ళు జెండాకు సెల్యూట్ చేస్తే వాళ్ళ దేశభక్తికి మనమందరం వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే.