అమ్మ బాటలోనే తమిళనాడు సర్కార్

ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జయలలిత మృతి చెందినప్పటి నుంచి తీవ్ర రాజకీయ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పళనిస్వామి ఈరోజు చెన్నైలోని సెయింట్ జార్జికోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ తన ప్రభుత్వం అమ్మ బాటలోనే సాగుతుందని, అమ్మ ప్రవేశపెట్టిన పధకాలన్నిటినీ యధాతధంగా అమలుచేస్తోందని చెప్పారు. తన ప్రసంగంలో ఎక్కడా పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. 

జయలలిత మృతి తరువాత ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకొనేందుకు శశికళ చాలా చురుకుగా పావులు కదిపారు. కానీ ఊహించని విధంగా అక్రమాస్తుల కేసులో జైలులో పడ్డారు లేకుంటే ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి హోదాలో జెండా ఎగురవేసి ఉండేవారు. ఆమె స్వయంగా ఎంపిక చేసిన పళనిస్వామి పన్నీరు సెల్వం చేతులు కలపడానికి ఆయన ఒత్తిడి మేరకు ఆమెను, ఆమె మేనల్లుడు దినకరన్ ను పార్టీ నుంచి బయటకు సాగనంపడం విశేషం. పన్నీరు సెల్వంకు పార్టీ పగ్గాలు, దానితోబాటు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించడానికి పళనిస్వామి సిద్దం అయినట్లు సమాచారం. కనీసం ఇప్పటికైనా అధికార అన్నాడిఎంకె పార్టీలో రాజకీయ అనిశ్చిత తొలగి మళ్ళీ పాలన గాడిన పడుతుందో లేదో చూడాలి.