రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో 84,877 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈరోజు ప్రకటించారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఇంతవరకు మా ప్రభుత్వం వివిధ శాఖలోని 27,660 పోస్టులను భర్తీ చేసింది. మరో ముప్పైవేల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోంది. రాగల రెండు మూడు నెలలో 84,877 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి. తెలంగాణా ఏర్పడితే లక్ష ఉద్యోగాలు ఏర్పడతాయని ఆనాడు నేను చెప్పాను. అదే మాట ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,12,536 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము,” అని తెలిపారు.