మానవ వనరులకు సరైన అర్ధం ఇదే: కేసీఆర్

స్వాతంత్ర్య దినోత్సవవేడుకల సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “ఇంతవరకు మానవ వనరులు అంటే అది ఐటి కంపెనీలకు సంబంధించిన విషయం అని అందరూ భావించేవారు. గత పాలకులు కూడా అదేవిధంగా వ్యవహరించేవారు. కానీ రాష్ట్రంలో వివిధ వృత్తిపనివారు అందరూ కూడా మానవవనరులేనని గుర్తించలేకపోయారు. 

మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అభిప్రాయాన్ని, ఆలోచనలను చెరిపివేసి, రాష్ట్రంలో రకరకాల వృత్తులలో ఉన్నవారికి అవసరమైన సహాయసహకారాలు అందించి ప్రోత్సహించడం మొదలుపెట్టాము. తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా వారి వలన రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతోంది. 

గొర్రెల పెంపకంలో మెళకువలు తెలిసిన రాష్ట్రంలో గొల్లకురుమలకు ఒక్కొక్క కుటుంబానికి 21 గొర్రెలు అందిస్తున్నాము. ఇంతవరకు 12 లక్షల గొర్రెలను అందించాము. అలాగే మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులలో చేపపిల్లల పెంపకం కార్యక్రమం చేపట్టడం ద్వారా అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాము. బట్టలు ఉతికే రజకులకు డ్రై క్లీనింగ్ సెంటర్లు, క్షురకులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది. రైతన్నలకు ట్రాక్టర్లు, ఆధునిక సేద్య పరికరాలు, రోజుకు 9 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నాము. వచ్చే ఏడాది నుంచి 24 గంటల విద్యుత్ అందించబోతున్నాము. అలాగే ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8,000 చొప్పున అందించబోతున్నాము. 

ఈవిధంగా రాష్ట్రంలో గల మానవవనరులను గుర్తించి వాటిని సరైన విధంగా ఉపయోగించుకొంటూ రాష్ట్రాభివృద్ధి కోసం మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. కానీ కొందరు స్వార్ధ రాజకీయ నేతలు, శక్తులు మా పనులను అడ్డుకొని రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అవరోధాలు సృష్టిస్తున్నా మేము మొక్కవోని దీక్షతో ముందుకే సాగుతుంటాము,” అని కేసీఆర్ అన్నారు.