నేటికీ ప్రజలలో ఆ స్ఫూర్తి కనిపిస్తూనే ఉంది: మోడీ

ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ డిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి దేశప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఆయన ముందుగా డిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్ళి అక్కడ జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన తరువాత ఎర్రకోట చేరుకొన్నారు. మువ్వన్నెల జెండా ఎగురవేసిన తరువాత త్రివిధ దళాల వందనం అందుకొన్నారు. తరువాత తన ప్రసంగం ప్రారంభించారు. 

ఆయన తన ప్రసంగంలో మొట్టమొదట యూపిలో గోరక్ పూర్ ఆసుపత్రిలో చిన్నారుల మరణం గురించి ప్రస్తావించడం విశేషం. 2017 సం.లోనే క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సం.లు, చంపారన్ సత్యాగ్రహానికి 100సం.లు, దేశంలో గణేష్ ఉత్సవాలకు 100 సం.లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. జి.ఎస్.టి. అమలు విషయం వివిధ రాష్ట్రాలు, దేశప్రజలు గొప్ప ఫెడరల్ స్ఫూర్తి చూపారని మోడీ మెచ్చుకొన్నారు. అధిక ఆదాయవర్గాలు స్వచ్చందంగా గ్యాస్ సబ్సీడీని వదులుకోవడం, దేశవ్యాప్తంగా అందరూ స్వచ్చా భారత్ ను అమలుచేయడం వంటివి దేశం పట్ల మనలో ఇమిడి ఉన్న ప్రేమాభిమానాలకు అద్దం పడుతున్నాయన్నారు.   

దేశభద్రతను కాపాడటం కోసం సరిహద్దుల వద్ద సైనికులు, దేశంలో పోలీసులు మరియు ఇతర భద్రతా సంస్థలు ఎనలేని కృషి, త్యాగాలు చేస్తున్నాయని మోడీ ప్రశంసించారు. ఒకప్పుడు ఉగ్రవాదంపై భారత్ ఒంటరి పోరాటం చేసేదని కానీ ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు భారత్ తో కలిసి పోరాడటానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. మనం 9 నెలల్లో మంగళ్ యాన్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయగలిగామని కానీ 42 సం.లు గడిచినా వన్ రైల్ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయామని మోడీ అన్నారు. 

నోట్ల రద్దు, జి.ఎస్.టి. అమలు తరువాత దేశంలో అక్రమాస్తులు పోగేసుకొన్న 18 లక్షల మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని మోడీ చెప్పారు. జి.ఎస్.టి. అమలులోకి వచ్చిన తరువాత 1.75 లక్షల సూట్ కేస్ కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశామని, అక్రమంగా దేశవిదేశాలకు నగదు బదిలీలు చేస్తున్న 300 హవాలా కంపెనీలను మూయించామని మోడీ చెప్పారు. ఇదే స్పూర్తితో దేశంలోని అవినీతిపరులు, అక్రమార్కులపై పోరాడుతూ దేశాన్ని అవినీతిరహితంగా చేద్దామని మోడీ అన్నారు. 2022కు భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మోడీ దేశప్రజలకు పిలుపునిచ్చారు.