కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాల నేతలు సోమవారం గవర్నర్ నరసింహన్ ను కలిసి నేరెళ్ళ ఘటనలో తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని పిర్యాదు చేశారు. కొన్ని రోజుల క్రితం సిరిసిల్ల రాజన్న జిల్లాలో నేరెళ్ళ గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలపై కొందరు స్థానికులు దాడి చేసి, ఒక లారీని తగులబెట్టారు. ఆ కేసులో పోలీసులు కొందరు దళితులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ కేసుపై ప్రతిపక్షాల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం డి.ఐ.జి నివేదిక ఆధారంగా ఒక ఎస్సైను సస్పెండ్ చేసింది. అంతటితో ఈ సమస్య ముగిసిపోయినట్లు వ్యవహరించడంతో ఈరోజు అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేశారు.
పోలీస్ స్టేషన్లోనే దళితులపై దాడులు జరిగితే ఇంతవరకు దోషులపై కేసులు నమోదు చేయకుండా ఒక ఎస్సైని సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందని, కనుక ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకొని దోషులు అందరికీ శిక్ష పడేలా చేయాలని, భాధితులకు నష్టపరిహారం అందేలా చేయాలని ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్ కు వినతి పత్రం ఇచ్చాయి.
గవర్నర్ నరసింహన్ కలిసిన వారిలో పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తదితరులున్నారు.
ఈ కేసులో దోషులు అందరికీ శిక్షపడి, బాధితులకు పూర్తి న్యాయం చేకూరేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. దళితులపై దాడులు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా అసలు దళితులపై దాడే జరుగలేదని వితండవాదం చేస్తోందని విమర్శించారు. తాము రాష్ట్రపతికి, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా నేరెళ్ళ ఘటనపై పిర్యాదు చేస్తామని చెప్పారు.