కృష్ణాష్టమి శుభాకాంక్షలు

నేడు కృష్ణాష్టమి. ప్రపంచానికి గీతను భోదించిన శ్రీకృష్ణుడు జన్మించిన రోజు. అందుకే దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. శ్రావణమాసం అష్టమి రోజున శ్రీకృష్ణుడు కంసుని చెరసాలలో జన్మించినప్పటి నుంచే తన లీలావిలాసాలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 

కుండపోతగా వర్షం కురుస్తున్న అర్ధరాత్రిపూట వాసుదేవుడు శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకొని రేపల్లెకు బయలుదేరితే ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది రెండుగా విచ్చుకొని ఆయనకు మార్గం కల్పించింది. రేపల్లెలో యశోద తనయుడిగా పెరిగిన శ్రీకృష్ణుడు ప్రతీ మనిషి ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొని పోరాడి జీవించాలని చూపించాడు. ఒక పక్క నిత్యజీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే తన చుట్టూ ఉన్నవారికి ఏవిధంగా ఆనందాన్ని పంచిపెట్టవచ్చో చూపించాడు. 

ధర్మపరివర్తనులైన పాండవులకు అండగా నిలబడి తనను నమ్ముకొన్నవారిని  ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటానని నిరూపించి చూపాడు. లోకనాయకుడైన శ్రీకృష్ణుడు తలుచుకొంటే పాండవులకు రాజ్యం ఇప్పించగలడు కానీ ధర్మసంస్థాపనార్ధం కురుక్షేత్రయుద్ధం జరుగవలసి ఉంది కనుకనే పాండవులు అడవులకు వెళుతున్నా వారించలేదు. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొనిరాగానే కురుక్షేత్ర మహాయుద్దానికి బీజం వేశాడు. 

తానే యుద్ధం చేస్తున్నాననే భ్రమలో ఉన్న అర్జునుడికి గీత ద్వారా జీవితసారాంశాన్ని భోదించి, తాను ఆడించే జగన్నాటకంలో అతను ఒక నిమిత్తమాత్రుడు మాత్రమే అని అర్ధమయ్యేలా చేసి పాండవుల ద్వారానే దుష్టశిక్షణ చేశాడు. తాను అవతారమూర్తినని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుకనే తను వచ్చినపని ముగియగానే తన అవతారం ముగించాడు. 

కృష్ణతత్వం చాలా లోతైనది కానీ సామాన్యులకు సైతం అర్ధం చేసుకొని ఆచరించగలిగేది. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే పరమాత్మను స్మరిస్తూ ఆనందంగా జీవించడమే కృష్ణతత్వం. శ్రీకృష్ణుని జీవితం, ఆయన లీలావిలాసాలు, ఆయన చూపిన భక్తి, ముక్తి, రక్తి మార్గాలు యావత్ మానవాళికి సదా ఆచరణీయమైనవి. అందుకే యుగాలు గడిచినా నేటికీ ఆయనను స్మరించుకొంటున్నాము. కులమత, బాషా,ప్రాంతాలకు అతీతంగా యావత్ మానవాళి ఇప్పుడు ‘హరేకృష్ణ..హరేకృష్ణ..కృష్ణ కృష్ణ..హరేకృష్ణ’ అని ఆనందపారవశ్యంతో భజిస్తోంది.