మాకు తెరాసతోనే పోటీ భాజపాతో కాదు: కుంతియా

దిగ్విజయ్ సింగ్ స్థానంలో తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా భాద్యతలు చేపట్టిన కుంతియా శనివారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ముందుగా ప్రకటించబోమని చెప్పారు. అటువంటి సాంప్రదాయం తమ పార్టీలో లేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో యువతకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోరుకొంటున్నారని అన్నారు. తెలంగాణా రాష్ట్రంలో భాజపా తమకు పోటీ కాదని, తెరాసతోనే తమకు పోటీ ఉంటుందని అన్నారు. అయితే తెరాసకు ఒక సిద్దాంతం లేకుండానే పని చేస్తోందని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో దాని ఓటమి ఖాయం అని అన్నారు.

కేసీఆర్ సర్వేల గురించి మాట్లాడుతూ ఆయనకు నిజంగా తమ పార్టీ ఎప్పుడు పోటీ చేసినా ఘనవిజయం సాధిస్తామనే అంత నమ్మకం ఉన్నట్లయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్ళవచ్చు కదా? అని కుంతియా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా చురుకుగా పని చేస్తోందని కుంతియా మెచ్చుకొన్నారు. ఇకపై ప్రతీ నెలలో 15 రోజులు రాష్ట్రంలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేయాలనుకొంటున్నట్లు కుంతియా చెప్పారు. పార్టీలో కొన్ని అంతర్గత సమస్యలున్నాయని వాటిని నేతలతో చర్చించుకొని పరిష్కరించుకొంటామని అన్నారు.