హైదరాబాద్ లో రాబోతున్న కొత్త ఫ్లై ఓవర్లు

రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ మూడో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం హైదరాబాద్ నగారాభివృద్ధి చేపడుతున్న చర్యల గురించి వివరించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధి చేసి ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు తమ ప్రభుత్వం రూ.3,000 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ను చేపట్టినట్లు చెప్పారు. 

దానిలో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ నుంచి కొంపల్లి, జూబ్లీ బస్టాండ్ మీదుగా శామీర్ పేట వరకు స్కై-వేలను నిర్మించబోతున్నట్లు తెలిపారు. రక్షణశాఖ అధీనంలో ఉన్న భూములు అందుబాటులోకి రాగానే అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. 

బాలానగర్ చౌరస్తాలో రూ.400 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ నిర్మించబోతున్నట్లు చెప్పారు. వాటికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని త్వరలోనే నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు.

రామాంతపూర్ లోని ఆరవ నెంబర్ రోడ్డు వద్ద నుంచి ఉప్పల్ వరకు ఒక ఫ్లై ఓవర్, ఉప్పల్ నుంచి నారప్ల్లి వరకు మరొక ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని చెప్పారు. వాటిలో మొదటిదానికి రూ.250 కోట్లు, రెండవ దానికి రూ.950 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు.    

జూబ్లీహిల్స్ 45వ నెంబర్ రోడ్డు నుంచి దుర్గం చెరువు మీదుగా అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ కేబుల్ బ్రిడ్జి నిర్మించబోతున్నామని తెలిపారు. అది మరో రెండేళ్ళలోగానే పూర్తవుతుందని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఇవికాక నగరంలో అనేక చోట్ల కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక ఖాళీ ప్రదేశం తీసుకొని అమరావతి నగరాన్ని నిర్మించడం సులువే కానీ ఎప్పుడో నిర్మించబడిన హైదరాబాద్ ను ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలను బట్టి అభివృద్ధి చేయడం చాలా సవాళ్ళతో కూడుకొన్నదని, అయినప్పటికీ హైదరాబాద్ నగరాన్ని విశ్వా నగరంగా అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందని కేటిఆర్ అన్నారు. నగరంపై ఒత్తిడి తగ్గించేందుకు హైదరాబాద్ చుట్టూ మినీ టౌన్ షిప్పులను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.