కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు త్వరలో శంఖుస్థాపన

తెలంగాణా ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు కోసం భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16న ఉదయం 11 గంటలకు శంఖుస్థాపన చేయబోతున్నారు. వరంగల్‌ రూరల్ జిల్లాలో గీసుకొండ-సంగెం మండలాల మద్యలో 1,190 ఎకరాలలో ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్కును రూ. 1,150 కోట్లు వ్యయంతో ఏర్పాటు చేయబోతున్నారు. దీనిలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలు స్థాపించేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.

ఈ టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటు అయితే రాష్ట్రంలో చేనేత, పవర్ లూమ్ కార్మికులతో బాటు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళినవారికి కూడా రాష్ట్రంలోనే బారీ ఎత్తున ఉపాధి లభిస్తుంది. ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

వరంగల్ లో ఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. ఒకపక్క రైతుల నుంచి భూసేకరణ జరుగుతుండగానే మరోపక్క మంత్రి కేటిఆర్ మరియు సంబంధిత అధికారులు తమిళనాడులోని టెక్స్‌టైల్‌ పార్కులను సందర్శించి, అక్కడి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వరంగల్ లో టెక్స్‌టైల్‌ పరిశ్రమలు స్థాపించేందుకు ఒప్పందాలు చేసుకొన్నారు. శంఖుస్థాపన జరిగిన ఏడాదిలోగా టెక్స్‌టైల్‌ పార్క్ లో ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఈ మెగా టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటయితే తెలంగాణా రాష్ట్రం కూడా టెక్స్‌టైల్‌ రంగంలో ప్రధాన కేంద్రంగా మారుతుంది. రాష్ట్రంలోని చేనేత, పవర్ లూమ్ కార్మికుల జీవన ప్రమాణాలలో ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పవచ్చు.