తెరాసకు అందుకే ఉందా? కోదండరామ్ ప్రశ్న

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ శుక్రవారం సికింద్రాబాద్ లో ప్రారంభించిన 4వ విడత తెలంగాణా అమరవీరుల స్ఫూర్తియాత్రను కామారెడ్డిలో పోలీసులు అడ్డుకొన్నారు. ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించి అక్కడ విడుదల చేశారు. అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “మా యాత్రను అడ్డుకోవడం ద్వారా తెరాస సర్కార్ తన బలహీనతను, అభద్రతాభావాన్ని బయటపెట్టుకొంది. తెరాసకు ప్రజలు అధికారం కట్టబెట్టింది కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి కాదు...ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మాత్రమే. కానీ అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియా, భూదందాలలో మునిగితేలుతున్నారు. ఎల్లకాలం తామే అధికారంలో ఉంటామని కలలు కంటున్నారు. కానీ ఎవరూ ఎల్లకాలం అధికారంలో ఉండలేరని, కనుక అధికారంలో ఉన్నప్పుడే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని తెరాస నేతలు గ్రహిస్తే మంచిది. తెలంగాణా కోసం పోరాడిన మాపై తెలంగాణా ఉద్యమ ద్రోహులు దాడులు చేస్తున్నారు. మా యాత్రను ఎవరూ అడ్డుకోరని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే చెప్పారు. కానీ ఈరోజు ఎక్కడికక్కడ తెరాస కార్యకర్తలు, పోలీసులే అడ్డుకొన్నారు. నన్ను అరెస్ట్ చేసి బలవంతంగా హైదరాబాద్ తీసుకువచ్చారు. అసలు ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు అడ్డుకొంటోంది?ఈరోజు నన్ను అరెస్ట్ చేసినా రేపు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి నా యాత్రను తప్పకుండా ప్రారంభిస్తాను. ప్రభుత్వం ఇటువంటి అణచివేత ధోరణి మానుకొంటే మంచిది. ఒకవేళ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుంటే మేము గాంధేయ మార్గంలో ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటాము. ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తాయనె నమ్మకం మాకుంది,” అని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.