తెరాస సర్కార్ కు హనుమంతన్న వార్నింగ్

మాజీ రాజ్యసభ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు తెరాస సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేరెళ్ళ ఘటనలో అసలైన దోషి ఎస్పిని వదిలిపెట్టి ఎస్సై ను అరెస్ట్ చేయడాన్ని హనుమంతరావు తప్పు పట్టారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసులో ఎస్పిపై కూడా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు గడువు ఇస్తున్నాను. ఒకవేళ ఆలోగా ప్రభుత్వం ఎస్పిపై చర్యలు తీసుకోకపోతే 31వ తేదీన నేరెళ్ళలో నిరాహార దీక్ష చేపడతాను. దళితులకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వారికి న్యాయం జరిగేవరకు వారి తరపున ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటుంది,” అని హెచ్చరించారు. మరోపక్క పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనలో భాధ్యులు అందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సిరిసిల్లా వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వ తీరును ఎండగడతానని హెచ్చరిస్తున్నారు. నేరెళ్ళ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్న తీరు చూస్తుంటే అవి ప్రభుత్వాన్ని అంత తేలికగా విడిచిపెట్టదలచుకోలేదని అర్ధం అవుతోంది.