భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, అనేక రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, భాజపా సీనియర్ నేతలు, ఎన్డీయే కూటమిలో వివిద పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రాంనాథ్ కోవింద్ వెంకయ్య నాయుడు చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రాజ్యసభ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరిస్తారు.
ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేసిన గోపాలకృష్ణ గాంధీ 244 ఓట్లు గెలుచుకోగా వెంకయ్య నాయుడు 516 ఓట్లతో విజయం సాధించారు. వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. 1972లో జరిగిన జై ఆంధ్రా ఉద్యమం ద్వారా రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆయన మొదట ఆర్.ఎస్.ఎస్.లో పనిచేశారు. తరువాత భాజపాలో చేరి 1978, 1983లో ఉదయగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం 1998, 2004,2010 లలో వరుసగా మూడుసార్లు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ఎంపిక అయ్యేవరకు కేంద్రమంత్రిగా సేవలు అందించారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా భాద్యతలు చేపట్టడంతో తన రాజకీయ జీవితంలో మరో ఉన్నత శిఖరం అధిరోహించినట్లయింది.