నేరెళ్ళ ఘటనపై దర్యాప్తు జరిపిన డి.ఐ.జి.రవివర్మ తన నివేదికను డిజిపి అనురాగ్ శర్మకు గురువారం రాత్రి అందించారు. దానిలో క్రైం కంట్రోల్ స్క్వాడ్ ఎస్సై రవీందర్ ఈ ఘటనకు మూలకారకుడని పేర్కొనడంతో, డిజిపి ఆదేశాల మేరకు ఎస్సై రవీందర్ ని సస్పెండ్ చేస్తూ వరంగల్ ఐజి నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు కూడా తీరని అప్రదిష్ట కలిగించిన ఈ ఘటనలో మరికొందరు పోలీసులపై కూడా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం. ఎస్సై రవీందర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడగానే మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “నేరెళ్ళ భాధితులకు ఇచ్చిన హామీని నిలుపుకొన్నాను,” అని ట్వీట్ చేశారు.
ఎస్సై రవీందర్ 2009 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి. మొదట సిరిసిల్లా జిల్లాలో పోస్టింగ్ అయినప్పుడు ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో ఎస్పికి అటాచ్ చేయబడ్డారు. కొన్ని రోజుల తరువాత చొప్పదండికి అక్కడి నుంచి మళ్ళీ సిరిసిల్లాకు బదిలీమీద వచ్చి ఇప్పుడు ఈ కేసులో సస్పెన్షన్ కు గురయ్యారు.
ఈ ఘటనలో ఆయన ఒక్కడినే కాకుండా బాధ్యులైన పోలీస్ అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దళితులపై దాడులు చేసిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కనుక వారందరిపై ప్రభుత్వం కటినమైన చర్యలు చేపట్టి, బాధితులకు నష్టపరిహారం చెల్లించేవరకు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి ఉండవచ్చు. ఈరోజు ప్రతిపక్షాలు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఈ సంఘటనపై పిర్యాదు చేయబోతున్నాయి.