ఎస్ఆర్ఎస్పి పూర్తి చేసి చూపుతాం: కెసిఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం శ్రీరాం సాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచంపాడులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, “సమైక్యరాష్ట్రంలో పాలకులు మనకు నీళ్ళు అందించే ప్రాజెక్టు ఒక్కటీ నిర్మించలేదు. నిర్మించినవి పూర్తి చేయలేదు. ఆ కారణంగా తెలంగాణా గుండా కృష్ణా, గోదావరి నదులు పారుతున్నా తెలంగాణాలో పొలాలకు ఎప్పుడూ నీళ్ళు అందేవి కావు. తెలంగాణా ఏర్పడి మేము అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ పొలాలకు నీళ్ళు పారించడానికి అవసరమైన పనులు యుద్దప్రాతిదికన చేపట్టాము. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు కోర్టులలో కేసులు వేస్తూ వాటికి అడ్డుపడుతూనే ఉన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కాంగ్రెస్ నేతలు 96 కేసులు వేశారు. అయినా వారు సృష్టిస్తున్న అవరోధాలను ఎదుర్కొంటూనే కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే ఈ మహాయజ్ఞాన్ని పూర్తిచేయడానికి మేము రేయింబవళ్ళు కష్టపడుతున్నాము. ఈ ఎస్.ఆర్.ఎస్.పి.పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయినట్లయితే 90 టి.ఎంసి.ల నీళ్ళు మనకు నిత్యం అందుబాటులో ఉంటాయి. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు పూర్తయితే సుమారు 200 కిమీ పొడవునా గోదావరి నీళ్ళు నిత్యం ప్రవహిస్తూనే ఉంటాయి. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా ఈ పనులన్నీ పూర్తి చేసి ఎస్.ఆర్.ఎస్.పి.లో నీళ్ళు నింపి చూపిస్తాను,” అని కేసీఆర్ అన్నారు.