వాహనాల రిజిస్ట్రేషన్స్ కు ఆధార్ తప్పనిసరి

ఇక నుండి తెలంగాణా రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్స్ మరియు పాత వాహనాలను వేరే వ్యక్తుల పేరిట బదలాయిస్తున్నప్పుడు వాహన యజమానుల ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరిచేస్తూ నిబంధన రూపొందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాతవాహనాలను ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతున్నప్పుడు వరుసగా అందరు యజమానుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డ్ వివరాలు రికార్డులలో భద్రపరచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అసలు యజమానిని గుర్తించడం చాలా కష్టంగా మారుతోందని, దాని వలన ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్ పరిష్కారం చేయడం కూడా కష్టం అవుతోందని కనుక ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్ సమయంలో యజమాని ఆధార్ కార్డ్ వివరాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి కోరారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 95 లక్షల వాహనాలు తిరుగుతున్నాయని వాటిలో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రెండు మూడుసార్ల కంటే ఎక్కువగానే చేతులు మారినట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. కనుక వాహనం యొక్క అసలు యజమానిని వెంటనే గుర్తించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం ట్రాఫిక్ పోలీస్ మరియు రవాణాశాఖ అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కానీ వాటిని ఇంకా తగ్గించవలసి ఉందని అన్నారు.