సి.ఎం.సభ కోసం స్కూల్ శలవులు!

ఈరోజు నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జరుగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు జనసమీకరణ కోసం జిల్లా మరియు దాని పరిసర ప్రాంతాలలో ప్రైవేట్ స్కూళ్ళకు చెందిన బస్సులను తెరాస నేతలు తీసుకువెళ్ళడంతో ఈరోజు ఆ స్కూళ్ళకు శలవు ప్రకటించవలసి వచ్చింది. దీనిపై స్కూల్ యాజమాన్యాలు పెదవి విప్పడానికి బయపడుతున్నప్పటికీ విద్యార్ధుల తల్లితండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుల సభల కోసం స్కూళ్ళు మూయించడం, బస్సులను తీసుకువెళ్ళడం సరికాదని అంటున్నారు. ఒకవేళ స్కూల్ బస్సులు అవసరమనుకొంటే విద్యార్ధుల చదువులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అకస్మాత్తుగా వచ్చి బస్సులు తీసుకువెళ్ళిపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని స్కూళ్ళ వద్ద విద్యార్ధుల తల్లితండ్రులు నిరసనలు తెలిపారు. మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అధ్వర్యంలో స్థానిక తెరాస ఎమ్మెల్యేలు, నేతలు  జనసమీకరణ చేస్తున్నారని సమాచారం. ఇటీవల నేరెళ్ళ ఘటనతో అపఖ్యాతి మూటగట్టుకొన్న తెరాస సర్కార్ మళ్ళీ వెంటనే ఇటువంటి పనులు చేయడం వలన మరింత చెడ్డపేరు వస్తుందని గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.