ఇక నోరు కట్టుకోక తప్పదు: వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు ఇంతవరకు భాజపా నేతగా, కేంద్రమంత్రిగా ఉన్నందున ఏ అంశంపైనైనా స్వేచ్చగా మాట్లాడేవారు.    కానీ ఆయన శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కనుక ఇక తన నోటికి తాళం వేసుకోక తప్పదని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. నిన్న హైదరాబాద్ లో తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇకపై రాజకీయాల గురించి మాట్లాడలేకపోయినప్పటికీ దేశాభివృద్ధికి సంబంధించిన అంశాలపై మాట్లాడే స్వేచ్చ తనకుంది కనుక అవసరమైనప్పుడు ఆ అంశాలపై మాట్లాడుతానని అన్నారు. ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాలలో ఉండి ఇప్పుడు వాటికి దూరం అవుతున్నందుకు చాలా బాధ కలుగుతోందని అన్నారు. కానీ అంతకంటే గొప్ప బాధ్యతలు నిర్వహించే అవకాశం కలిగినందుకు ఆనందంగా కూడా ఉందని అన్నారు.ప్రజలకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో మాట్లాడటంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని మెచ్చుకొన్నారు. తాను ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు తన పరిధిలో సాధ్యమైనంతవరకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటానని అన్నారు.   

రాజ్యసభ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది కనుక సభను వీలైనంత హుందాగా నడిపించేందుకు యధాశక్తిన ప్రయత్నిస్తానని వెంకయ్య నాయుడు చెప్పారు. నేడు వారసత్వ రాజకీయాల కంటే మంచి తెలివితేటలూ, రాజకీయ చతురత, సేవాగుణం ఉన్నవారు రాజకీయాలలో చేరవలసిన అవసరం ఉందని అన్నారు. చిరకాలంగా గవర్నర్ పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్న తెదేపా నేత మోత్కుపల్లి నరసింహులు త్వరలో శుభవార్త వినబోతున్నారని వెంకయ్య నాయుడు చెప్పడం విశేషం.